: తూతుక్కుడి ఆంధ్రాబ్యాంకుపై బాంబు దాడి... రగులుతున్న తమిళనాడు
తమిళనాట ఆంధ్రా ఆస్తులపై దాడుల తీవ్రత పెరిగింది. నిన్నటి వరకూ ఆర్టీసీ బస్సులు లక్ష్యంగా సాగిన దాడులు నేడు కార్యాలయాలకు విస్తరించాయి. ఈ ఉదయం తూతుక్కుడిలోని ఆంధ్ర బ్యాంకు శాఖపై దుండగులు బాంబు విసిరారు. ఆ సమయంలో కార్యాలయం మూసి ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదని సమాచారం. రెండురోజుల క్రితం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తమిళనాడులో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. వేలూరు, తిరువణామలై తదితర ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్డెక్కారు. నేడు వరుసగా మూడో రోజు ఏపీ నుంచి చెన్నైకి బస్సుల రాకపోకలు నిలిచాయి. సుమారు 200 బస్సులను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఆంధ్రావారు నిర్వహిస్తున్న సంస్థలు, కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. నిన్న తిరుచ్చి సమీపంలో జీఎంఆర్ నిర్వహణలోని ఆస్తులపై దాడులు జరిగిన సంగతి విదితమే. ఆంధ్రాబ్యాంకుపై బాంబుదాడి ఘటనలో పోలీసులు ఇద్దరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.