: వికారుద్దీన్ కు దేవుడే తగిన శిక్ష వేశాడు... చిత్తూరు జిల్లా మహిళ సంబరాలు
వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో నిన్న పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాది వికారుద్దీన్ ఉదంతంపై చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ శాంతమ్మ హర్షం వ్యక్తం చేశారు. దేవుడే ఆ దుర్మార్గుడికి తగిన శిక్ష విధించాడని ఆమె పేర్కొన్నారు. హైదరాబాదులో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన వికారుద్దీన్ వల్ల శాంతమ్మకు ఏం నష్టం జరిగిందనేగా మీ అనుమానం. కరుడుగట్టిన వికారుద్దీన్ వల్ల శాంతమ్మ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన భర్తను కోల్పోయారు.
వివరాల్లోకెళితే... చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన రమేశ్, కడపలోని ఏపీఎస్పీ 11 బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాదులో కొంతకాలం పాటు పనిచేశారు. 2010, మే 14న విధుల్లో ఉన్న రమేశ్ ను వికారుద్దీన్ అకారణంగా పొట్టనబెట్టుకున్నాడు. ప్రస్తుతం రామసముద్రంలో ఉంటున్న శాంతమ్మ, వికారుద్దీన్ హతమైన విషయాన్ని తెలుసుకుని బంధువులు, స్నేహితులకు మిఠాయిలు పంచారు.