: నాన్సెన్స్... ఇంకా నెలసరి కిస్తీలు తగ్గించరేం?: ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్
గతంలో వడ్డీ రేట్లు తగ్గించినా ఆ ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడంలో బ్యాంకర్లు విఫలం అయ్యారని ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ విమర్శించారు. ఏ పెద్ద బ్యాంకు కూడా కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న వడ్డీలను తగ్గించలేదని ఆయన దుయ్యబట్టారు. రెండు సార్లు రెపో రేటును (ఆర్‌బిఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ) తగ్గించినా, ప్రభుత్వ రంగ ఎస్ బీఐ, అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐలు ఆ మేరకు ఖాతాదారులకు ఎటువంటి లాభాన్ని కలిగించలేదని అన్నారు.
నిధుల వ్యయం దిగిరాలేదని బ్యాంకులు చెప్పడం 'నాన్సెన్స్' అని ఈ ఉదయం జరిగిన పత్రికా సమావేశంలో రాజన్ అన్నారు. రెపో, రివర్స్ రెపో తదితరాలను ఆర్‌బిఐ పెంచినప్పుడు తక్షణమే ఆ భారాన్ని ప్రజలపై వేసే బ్యాంకులు, తగ్గించినప్పుడు మాత్రం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో రెపో రేటును 8 నుంచి 7.5 శాతానికి తగ్గించమని ఆయన గుర్తు చేశారు. బ్యాంకులు మాత్రం ప్రజల నుంచి నెలవారీ కిస్తీలపై వసూలు చేస్తున్న వడ్డీని ఒక్క పైసా కూడా తగ్గించలేదని ఆరోపించారు. వడ్డీ రేట్లు తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్న విషయాన్ని బ్యాంకులు మరిచాయని విమర్శించారు.