: జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం... సాయంత్రం భేటీ కానున్న కేసీఆర్ కేబినెట్!
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవల హైకోర్టు మొట్టికాయల నేపథ్యంలో ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్న తెలంగాణ కేబినెట్, ఎన్నికలపై ప్రధానంగా చర్చించనుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి, తమకు ఏ మేర సానుకూలత వ్యక్తమవుతుంది... తదితర అంశాలపై కేసీఆర్ తన కేబినెట్ సహచరులతో సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో సూర్యాపేట షూటర్స్ హల్ చల్, ఆ తర్వాత వారు సిమి ఉగ్రవాదులని తేలడం, పోలీసు బాసుల వైఫల్యం తదితరాలపైనా కేబినెట్ భేటీలో కీలక చర్చ జరగనుందని తెలుస్తోంది.