: ఈ సంవత్సరం మార్కెట్లోకి రానున్న 5 చౌక కార్లు!
ఎగువ మధ్య తరగతి ప్రజలతో పాటు, కొత్తగా కారు కొనాలని భావిస్తున్న వారికోసం ఈ సంవత్సరం 5 కొత్త కార్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్ల ధరలు రూ. 4 లక్షల కన్నా లోపే ఉంటాయని తెలుస్తోంది. దీంతో భారత ఆటో ఇండస్ట్రీ కొత్త కార్ల రాకపై ప్రత్యేక దృష్టిని సారించింది. 2015లో మార్కెట్లోకి రానున్న చౌక కార్లు ఇవి.
1. రెనాల్ట్ ఎక్స్ బీఏ 800 సీసీ స్మాల్ హ్యచ్ బ్యాక్
గత ఏడాదిన్నర కాలంగా పలు కొత్త కార్లను ఆవిష్కరించిన రెనాల్ట్ ఈ సంవత్సరం జూన్ తరువాత రూ. 3 లక్షలకు అటూ ఇటుగా ఉండేలా ఈ కారును మార్కెట్లోకి తేనుంది. 3- సిలెండర్ పెట్రోల్ ఇంజిన్ తో లభించే కారు ఎంట్రీ లెవల్ హ్యచ్ బ్యాక్ అని సంస్థ తెలుపుతోంది. మారుతీ సుజుకీ ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ తదితర కార్లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
2. డాట్సన్ రెడీ- గో
ఇప్పటికే 'గో' పేరిట బడ్జెట్ హ్యచ్ బ్యాక్ కారును విక్రయిస్తున్న డాట్సన్ మరింత తక్కువ ధరలో 'రెడీ గో' పేరిట మరో కారును విడుదల చేయనుంది. పెట్రోల్, ఎల్పీజీ ఆప్షన్ లతో లభించే ఈ కారు ధర రూ. 2.50 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. పండగ సీజన్ లో కారు విడుదలయ్యే అవకాశముంది. ఈ కారు కూడా మారుతీ ఆల్టో 800కు గట్టి పోటీ ఇవ్వవచ్చు.
3. టాటా నానో ట్విస్ట్ ఏఎంటీ
2014 ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన టాటా నానో ట్విస్ట్ ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్) ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. గుజరాత్ లోని సనంద్ ప్లాంట్ లో తయారైన కారులో నానోలో వాడిన 624 సీసీ ఇంజిన్ ను వినియోగించారు. 5 స్పీడ్ ఏఎంటీ, కొత్త బంపర్లు, ఫాగ్ ల్యాంపులు దీనికి అదనపు ఆకర్షణ. దీని ధర కూడా రూ. 2.5 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది.
4. టాటా కైట్ హ్యచ్ బ్యాక్
'కైట్' కోడ్ నేమ్ పేరిట టాటా మోటార్స్ తయారు చేస్తున్న సరికొత్త హ్యచ్ బ్యాక్ కారు. ఇండికా ఈవీ2కు ప్రత్యామ్నాయంగా నిలువనుంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ లతో లభించే ఈ కారు మరో రెండు మూడు నెలల్లో మార్కెట్లోకి రానుంది. దీని ఖరీదు ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.
5. టాటా పెలికాన్ 800
కైట్ తో పాటు టాటా మోటార్స్ తయారు చేస్తున్న మరో హ్యచ్ బ్యాక్ పెలికాన్. ఆల్టో కే 10, హ్యుందాయ్ ఇయాన్ తదితర కార్లకు పోటీగా 1000 సీసీ పెట్రోల్, 800 సీసీ డీజిల్ ఇంజిన్ లతో ఈ కారును తయారు చేస్తున్నారు. డిసెంబర్ లోగా విడుదల చేయాలని భావిస్తున్న ఈ కారు ధర రూ. 2.50 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది.