: సినీ పరిశ్రమ ఏపీకి వస్తే బావుంటుంది... తూ.గో.జిల్లాలో స్టూడియో ఏర్పాటు చేయాలనుకుంటున్నా: నటి హేమ
తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని తాను కోరుకుంటున్నట్టు నటి హేమ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలం మాచవరంలో తెలిసినవాళ్ల ఇంటికి వచ్చిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాజమండ్రి-రాజోలు మధ్యలో స్టూడియో నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు హేమ వెల్లడించారు. దానికి అనుకూలమైన స్థలం సేకరించే పనిలో ఉన్నానన్నారు.
ఇక్కడ సినిమా షూటింగ్స్ కు అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని, ఈ ప్రాంతంలో సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలంటే స్థానికులు సినీ పరిశ్రమలోని వ్యక్తుల విషయంలో గౌరవప్రదంగా ప్రవర్తించాలని చెప్పారు. పరిశ్రమ వృద్ధితో చాలామందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇటీవల 'మా' అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన వివాదాలపై హేమ స్పందిస్తూ, 'మా' ఎన్నికల్లో పోటాపోటీ వాతావరణం నెలకొన్న విషయం వాస్తవమేనన్నారు. కానీ అది ఎన్నికల వరకేనని, ఇతర విషయాల్లో తామంతా ఒకటిగానే ఉంటామని చెప్పారు.