: బడే సాబ్ కో మార్ రే... ‘హైటెక్’ కాల్పుల సందర్భంగా ‘సూర్యాపేట’ షూటర్స్ సంభాషణ
ఖాకీపైనే కాల్పులకు తెగబడి నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్న‘సూర్యాపేట’ షూటర్స్ కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. మూడు రోజుల క్రితం సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో పోలీసులపై పిస్టళ్లతో విరుచుకుపడిన అక్రమ్, జకీర్ లు నాటి ఘటనలో గాయపడ్డ సూర్యాపేట సీఐ మొగిలయ్య లక్ష్యంగానే దాడి చేశారట. హైదరాబాదు-విజయవాడ బస్సుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ దోపిడీ దొంగల పాలిట మొగిలయ్య సింహస్వప్నంలా మారారట.
వంద మంది సభ్యులున్న మీరట్ దోపిడీ ముఠాకు చెందిన లీడర్ ను ఇటీవలే మొగిలయ్య అరెస్ట్ చేశారు. అంతేకాక రెండు వారాల క్రితం ఢిల్లీ వెళ్లి మరికొంత మందిని అరెస్ట్ చేశారు. తాను అరెస్ట్ చేసిన వారిని కలుసుకునేందుకు వస్తున్న వారిపైనా మొగిలయ్య ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మొగలియ్యను అక్రమ్, జకీర్ లు చంపేందుకు యత్నించారు. మొగిలయ్యపై కాల్పులకు ముందు ‘‘బడే సాబ్ కో మార్ రే’’ అంటూ షూటర్లిద్దరూ అరుస్తూ ఆయనపై దాడి చేశారు.
అయితే వారిని మొగిలయ్య తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు పేల్చిన బుల్లెట్లు గురి తప్పి మొగిలయ్య బతికిపోయారు. ఇదిలా ఉంటే, దుండగుల దాడిలో గాయపడ్డ మొగిలయ్య కిందపడిపోగానే, ఆయన చనిపోయాడని భావించే దుండగులిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోయారట. మొగిలయ్యలో ఏమాత్రం కదలిక కనిపించినా వారు మళ్లీ కాల్పులు జరిపి ఉండేవారని పోలీసులు చెబుతున్నారు.