: ముందు నుయ్యి... వెనుక గొయ్యి!... ఇదీ నవాజ్ షరీఫ్ పరిస్థితి!

యెమెన్ సంక్షోభ పరిష్కారానికి తన వంతు ప్రయత్నంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ టర్కీ బయల్దేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్, ప్రధాని అహ్మత్ డవుటోగ్లును షరీఫ్ కలవనున్నారు. యెమెన్ సంక్షోభంలో తమ పాత్ర ఎలా ఉంటే బావుంటుందనే దానిపై వీరు చర్చించనున్నారు. యెమెన్ లో తీవ్రవాదులతో పోరాడుతున్న సంక్షీర్ణసేనలో భాగస్వాములు కావాలని ముస్లిం దేశాల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన టర్కీ బయల్దేరారు. యెమెన్ సంక్షోభం నేపథ్యంలో పాక్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. సంకీర్ణ సేనలకు మద్దతిస్తే పాక్ లో జాతుల వైరం తలెత్తే ప్రమాదం ఉంది. ఇది మరో అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. పాక్ లో సున్నీ, షియా వర్గాలు నివసిస్తున్నాయి. సున్నీల ప్రాబల్యం ఎక్కువ. షియా వర్గం 20 శాతం ఉంది. యెమెన్ లో షియా తిరుగుబాటుదారులపై యుద్ధానికి వెళితే వీరంతా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, షరీఫ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News