: 12న అద్దె ఇంటికి మారనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అద్దె ఇంటికి మారుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని రోడ్ నెంబరు 65లోని సొంతింటిలో చంద్రబాబు నివసిస్తున్నారు. మొన్నటిదాకా ముగ్గురు సభ్యులతో ఉన్న చంద్రబాబు కుటుంబం తాజాగా ఐదు మందికి చేరింది. కొడుకు లోకేశ్, బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని పెళ్లి చేసుకోవడం, ఇటీవలే ఆ దంపతులకు పుత్రుడు జన్మించడం తెలిసిందే. కుటుంబ సభ్యులు పెరగడం, ఇల్లు పాతబడిన నేపథ్యంలో సొంతింటి రూపురేఖలు మార్చాలని చంద్రబాబు ఇదివరకే నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో సొంతింటి పునర్నిర్మాణంతో అద్దె ఇంటి కోసం వెతికిన చంద్రబాబు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 24 లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 12న అద్దె ఇంటికి మారేందుకు చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఆ ఇంటికి మారగానే సొంతింటిని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త ఇల్లును కట్టే పనిని చంద్రబాబు ఇప్పటికే ఓ కాంట్రాక్టరుకు అప్పగించారట. 15 నెలల్లో చంద్రబాబు సొంత స్థలంలో కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి కానుంది. వెనువెంటనే ఆయన కొత్త ఇంటికి మారనున్నారు.