: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన రద్దు?

జూన్ లో జరగాల్సిన టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ ఈ వారంలో అత్యవసర సమావేశం నిర్వహించబోతోంది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ (బంగ్లాదేశ్) బదులు ఐసీసీ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కప్ ను విజేత ఆస్ట్రేలియాకు అందించారు. అంతకు ముందు ఇండియా చేతిలో బంగ్లాదేశ్ జట్టు చిత్తు అయిన మ్యాచ్ నేపథ్యంలో, కమల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఐసీసీని బీసీసీఐ శాసిస్తోందని, అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ... విజేత జట్టుకు కప్ అందించే అవకాశాన్ని కమల్ కు బదులు శ్రీనీకి అప్పగించింది. దీంతో, ఐసీసీ అధ్యక్ష పదవికి కమల్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో, శ్రీనీపై కమల్ చేసిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకున్న బీసీసీఐ... బంగ్లాదేశ్ పర్యటన గురించి చర్చించనుంది. ఈ సమావేశంలో పర్యటనను రద్దు చేయాలని శ్రీనీ వర్గం బలంగా వాదించబోతోంది. దీనికితోడు, శ్రీనీ వ్యతిరేకులు కూడా... ప్రపంచకప్ సందర్భంగా కమల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. బీసీసీఐపై విమర్శలు చేసిన వారిని ఉపేక్షించరాదనే ఆలోచనలో వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, బంగ్లా పర్యటన రద్దయినట్టేనని విశ్వనీయ సమాచారం.

More Telugu News