: రైనా పెళ్లి విందుకు నలభీములు!

టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి రేపు ఢిల్లీలో జరగనున్న సంగతి తెలిసిందే. బాల్య స్నేహితురాలు ప్రియాంక చౌదరిని రైనా పరిణయమాడుతున్నాడు. వీరి వివాహ మహోత్సవానికి టీమిండియా సహచరులే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తదితరులు కూడా విచ్చేస్తున్నారు. దీంతో, విందు అదిరిపోవాలని రైనా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందుకే లక్నోలో పేరుగాంచిన 'తుండే కబాబి' రెస్టారెంటుకు చెందిన వంటవాళ్లను ఢిల్లీ తీసుకువస్తున్నారు. లక్నోలోని అమీనాబాద్ ప్రాంతంలో ఉండే 'తుండే కబాబి' రెస్టారెంటుకు రైనా వీలు చిక్కినప్పుడల్లా వెళుతుంటాడు. ఆ రెస్టారెంటుకు చెందిన రహ్మాన్, అతని సహాయకులు ఇప్పుడు రైనా వివాహ విందులో గరిటె తిప్పనున్నారు. వారితో బిర్యానీ, లక్నో స్టయిల్ గలౌటీ కబాబులు, మటన్ కుర్మా, షీర్మల్ వంటి నోరూరించే వంటకాలు తయారుచేయించి అతిథులకు వడ్డించనున్నారు. ఈ వివాహానికి బీసీసీఐ నుంచి అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా, బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కెప్టెన్ ధోనీ, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, హైదరాబాదీ స్టార్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరవుతారని సమాచారం.

More Telugu News