: ‘పన్ను’పై తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అభ్యంతరం... రేపు భవిష్యత్ కార్యాచరణ
రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్ర పన్నుల విధానంతో రూ.40 కోట్ల మేర నష్టపోయామని చెబుతూ అంతరాష్ట్ర పన్ను వసూలుకు తెర తీసిన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల నుంచి విముఖత వ్యక్తమవుతుండగా, తాజాగా సొంత రాష్ట్రంలోని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది.
అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన అంతర్రాష్ట్ర పన్నుపై టీఎస్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీనిపై రేపు అత్యవసరంగా భేటీ కావాలని తీర్మానించింది. అంతేకాక అంతర్రాష్ట్ర పన్నుకు వ్యతిరేకంగా సాగించాల్సిన పోరుకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు భావిస్తున్నారు.