: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ... సాయంత్రం అధికారులతో చంద్రబాబు కీలక సమావేశం
ఏపీ కేబినెట్ నేటి ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం, సీఎం సింగపూర్ పర్యటనలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన అంతర్రాష్ట్ర పన్ను వసూలుపై ప్రధానంగా చర్చ జరగనుంది. అంతర్రాష్ట్ర పన్ను వసూలుపై ఏ విధంగా స్పందించాలన్న కోణంపై భేటీలో కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ సమావేశం తర్వాత, నేటి సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు కీలక భేటీని నిర్వహించనున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే అంశాలపై చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. అంతేకాక నవ్యాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం, సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ తదితరాలపైనా చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు.