: ఏపీ ఎన్నికల్లో డబ్బులే డబ్బులు... ఒక్కో అభ్యర్థి రూ.15 కోట్లు ఖర్చు పెట్టారట!
తొమ్మిది నెలల క్రితం ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు కరెన్సీ నోట్ల వరద పారించారు. ఒక్కో అభ్యర్థి ఏకంగా రూ.15 కోట్ల మేర డబ్బును వెదజల్లారు. ఇది అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సగటు లెక్క మాత్రమే. ఇక హోరాహోరీ పోరు సాగిన నియోజకవర్గాల్లో ఖర్చైన మొత్తం ఈ సగటుకు రెండు, మూడు రెట్ల పైమాటేనట. ఇదేదో ఓ పార్టీ నేతపై ప్రత్యర్థి పార్టీ నేత చేసిన ఆరోపణ ఎంతమాత్రం కాదు. దేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణతో పాటు, ఎన్నికలపై నిఘా వేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఈ వ్యాఖ్య చేశారు.
ఎన్నికల సంస్కరణలపై నిన్న ఢిల్లీలో జరిగిన సదస్సు సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ ఈ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అంతేకాక, అసలు ఇంతమేర భారీ నిధులు అభ్యర్థులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికెళుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా పరిస్థితి మారకపోతే, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని చూడలేమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.