: సమ్మె సైరన్ మోగిస్తున్న బ్రిటన్ రాణి సిబ్బంది

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సిబ్బందిలో అసంతృప్తి రాజుకుంది. వేతనాల విషయంలో వారు కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే తక్కువ జీతాలిస్తున్నారని, దానికితోడు, అదనపు విధులు కేటాయిస్తున్నారని పబ్లిక్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ (పీసీఎస్) యూనియన్ తెలిపింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, అందుకే తాము సమ్మె నిర్ణయం తీసుకోనున్నామని యూనియన్ నేతలు తెలిపారు. రాణికి చెందిన విండ్సర్ క్యాజిల్ లో వీరందరూ పనిచేస్తున్నారు. అక్కడికి క్వీన్ ఎలిజబెత్ వారాంతాల్లో వెళుతుంటారు. క్యాజిల్ లో ప్రముఖులకు పార్టీలు ఇస్తుంటారు. కాగా, ఉద్యోగులు రాజకుటుంబానికి విధేయులేనని, అతిథులకు రాచమర్యాదలు చేయడంలో నిబద్ధతతో పనిచేస్తారని పీసీఎస్ జనరల్ సెక్రటరీ మార్క్ సెర్వోట్కా తెలిపారు. కానీ, ఉద్యోగులు ఉచితంగా పనులు చేస్తారని భావించడం సరికాదని అన్నారు. అదనపు విధులకు ఏమీ చెల్లించడంలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న జీతభత్యాలు దారుణమని అభిప్రాయపడ్డారు. సమ్మె విషయంపై యూనియన్ లో ఓటింగ్ నిర్వహించి, మెజారిటీ అభిప్రాయాన్ని అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

More Telugu News