: తిరుపతి చేరుకున్న చంద్రబాబు... మేర్లపాక పయనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. అనంతరం, మేర్లపాక బయల్దేరారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ, సుజనా చౌదరి కూడా ఉన్నారు. చంద్రబాబు ఈ సాయంత్రం ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఒకే చోట మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ నిర్వహించనున్నారు.
కాగా, చంద్రబాబు ఈ మధ్యాహ్నం వరకు ఢిల్లీలో మెట్రో రైలు వ్యవస్థ పనితీరును పరిశీలించారు. నగరంలోని శివాజీ స్టేడియం స్టేషన్ నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలులో ప్రయాణించి పలు విషయాలు తెలుసుకున్నారు. ప్రపంచంలోని మెట్రో రైలు వ్యవస్థలను కూడా పరిశీలిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలోనూ విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కారు కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే.