: తవ్వినకొద్దీ పాములు... చిలకలూరిపేటలో కలకలం
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ ఇంట్లో తవ్వేకొద్దీ పాములు బయటికి రావడం ఆశ్చర్యం కలిగించింది. పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన నివాసంలో పాముల కలకలం రేగింది. తొలుత ఓ విష సర్పం రావడంతో దాన్ని చంపేశారు. ఓ మూలన ఉన్న బొరియ నుంచి ఆ పాము వచ్చినట్టు గ్రహించిన ఆ ఇంటి యజమాని పరిశీలించి చూడగా, అక్కడ ఎన్నో పాములున్నట్టు గుర్తించాడు. అవి బయటికి వస్తుండడంతో ఓ 30 పాములను స్థానికులు చంపేశారు. ఇంకా వస్తూనే ఉన్నాయట. తన ఇంటి చుట్టు విపరీతంగా చెత్త పేరుకుపోయిందని, అందుకే పాములు చేరి ఉంటాయని ఇంటి యజమాని అభిప్రాయపడ్డాడు. పురపాలక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదన్నాడు.