: కేసీఆర్ పెంచారు... చంద్రబాబు కూడా పెంచాల్సిందే: రోజా
తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచారని, ఏపీలో కూడా పెంచాలని వైఎస్సార్సీపీ మహిళా నేత రోజా డిమాండ్ చేశారు. అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, చంద్రబాబు పెంచకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తలతో చాకిరీ చేయించుకుంటున్నారని రోజా ఆరోపించారు. అంగన్ వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు అంగన్ వాడీ ఉద్యోగులను కించపరిచేలా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో అంగన్ వాడీలు మెరుగైన జీతాలు తీసుకుంటున్నప్పుడు, మన రాష్ట్రంలోనూ మంచి వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, లేకుంటే అంగన్ వాడీ ఉద్యోగులు కుంగిపోతారని అభిప్రాయపడ్డారు.