: కాలితో తన్నాడని ఓ గ్రామ సింహం గ్యాంగును వెంటేసుకొచ్చింది!
చైనాలోని చాంగ్ కింగ్ నగరంలో ఓ ఆసక్తిగొలిపే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన కారులో ఇంటికి చేరుకున్నాడు. కారును పార్క్ చేద్దామనుకుంటుండగా, ఆ స్థలంలో ఓ వీధి కుక్క పడుకుని కనిపించింది. హారన్ కొట్టినా అది అక్కడి నుంచి కదలకపోవడంతో కారు దిగి వెళ్లి కాలితో బలంగా తన్నాడు. దీంతో, అది అక్కడి నుంచి నిష్క్రమించింది. మనవాడు కారు పార్క్ చేసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సినిమా మొదలైంది! అలా వెళ్లిన కుక్క ఇతర కుక్కలను వెంటేసుకుని వచ్చింది. వచ్చీరావడంతోనే కారును ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేశాయి. కొన్ని గ్రామ సింహాలు కారు బాయినెట్ ను నాశనం చేస్తే, మరికొన్ని టైరు పనిబట్టగా, ఇంకొన్ని వైపర్స్ ను కొరికి ముక్కలు చేశాయి. ఈ తతంగాన్నంతా పక్కింటి వ్యక్తి ఎంచక్కా కెమెరాలో రికార్డ్ చేశాడు. కాసేపటి తర్వాత ఆ యువకుడు బయటికొచ్చి తన కారు రూపురేఖలు మారిపోయి ఉండడాన్ని గమనించాడు. పక్కింటి వ్యక్తి వచ్చి కుక్కల వీరవిహారం తాలూకు వీడియో చూపించాడు. దీంతో, ఆ కుర్రాడు జరిగిన విషయాన్ని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బిక్కమొహం వేశాడు.