: హాలీవుడ్ నటి కాళ్ల విలువ రూ.250 కోట్లట... భారీ పాలసీ ఇవ్వనున్న ఇన్స్యూరెన్స్ కంపెనీ
ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమేనండోయ్. హాలీవుడ్ నటిగానే కాక సింగర్, నిర్మాతగానూ రాణిస్తున్న టేలర్ స్విఫ్ట్ తన అందమైన కాళ్లను రూ.250 కోట్లకు ఇన్స్యూరెన్స్ చేయించుకోనుంది. మంచి గాయనిగా పేరుగాంచిన టేలర్, తన స్టెప్పులతో అభిమానులను కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే. వేదికపై ఆమె స్టెప్పులేస్తుంటే, కళ్లార్పడం కూడా మరచిపోతుంటామని ఆమె అభిమానులు చెబుతుంటారు.
తన కాళ్లేమైనా అయితే పరిస్థితి ఏమిటనే సందేహం వచ్చిన ఆమె ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీని ఆశ్రయించిందట. తన కాళ్లకు ఎంతమేరకు బీమా తీసుకోవచ్చని ఆమె ఆరా తీసింది. సదరు ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి చెప్పిన మాట విని టేలర్ కూ దిమ్మ తిరిగిందట. ఏ రూ. 60 కోట్ల మేర పాలసీనో ఇస్తారని టేలర్ భావిస్తే, ‘‘మీ కాళ్ల విలువ మీకు తెలియదు మేడం. రూ.250 కోట్ల వరకూ బీమా చేయొచ్చు’’ అంటూ సదరు ప్రతినిధి చెప్పాడట. దీంతో వెనువెంటనే స్పందించిన టేలర్ వెంటనే కాళ్లను బీమా చేయించుకునేందుకు నిర్ణయించుకుందట. మే నెలలో తన మ్యూజికల్ టూర్ ప్రారంభమయ్యేలోగా సదరు పాలసీని తీసుకోవాలని ఆమె ప్లాన్ చేసుకుంటోంది.