: తీగల్లేకుండా కరెంటు... అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్ సైంటిస్టులు!


సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎంతో ముందున్న జపాన్, తాజాగా మరో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు తీగల సాయం లేకుండా విద్యుత్ ను ప్రసారం చేసి అందరితో ఔరా అనిపించారు. సూక్ష్మ తరంగాల రూపంలో మార్చిన 1.8 కేవీ విద్యుత్ ను 55 మీటర్ల పరిధిలో ప్రసారం చేసి అబ్బురపరిచారు. ఈ సూక్ష్మ తరంగాలకు హై కెపాసిటీ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో విద్యుత్ ప్రసార రంగంలో తమ పరిశోధన సంచలనాత్మక మార్పులకు కారణమవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా, రోదసిలోని అపారమైన సౌర శక్తిని భూమికి తరలించేందుకు ఈ సరికొత్త టెక్నాలజీ బాటలు పరుస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఏదో ఒకనాడు ఆ తరగని శక్తిసంపదను మానవులు వినియోగించుకోవడం సాధ్యమేనని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ విశ్వసిస్తోంది. ఈ దిశగా పరిశోధనలను అమెరికా, జపాన్ దేశాలు 1960లోనే ప్రారంభించాయి. భూ ఉపరితలం నుంచి సౌర శక్తిని గ్రహించడం కంటే రోదసిలో సౌర శక్తి ఉత్పాదనకు అనేక ఆధిక్యతలు ఉన్నాయి. భూమిపై అయితే సౌర శక్తి ఉత్పాదనకు ప్రతికూల వాతావరణం ఒక్కోసారి అడ్డంకిగా నిలిచే ప్రమాదం ఉంటుంది. అదే, రోదసిలో అయితే కాలంతో పనిలేకుండా ఎప్పుడైనా సౌర శక్తిని ఒడిసిపట్టే వెసులుబాటు ఉంటుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News