: ఏపీ విద్యుత్ వద్దన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం... ఇప్పటివరకున్న బకాయిలు చెల్లించండి: ఏపీ ట్రాన్స్ కో
ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ ఇస్తామన్నా తమకు అవసరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఏపీ ట్రాన్స్ కో అధికారులు అన్నారు. కేసీఆర్ ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, ఎస్ఆర్ఎల్ డీసీకి లిఖిత పూర్వకంగా తెలియజేయాలని విన్నవించారు. తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణకు ఏపీ నుంచి విద్యుత్ ఇస్తున్నా కొందరు నేతలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఎక్కడి విద్యుత్ ను అక్కడే వాడుకుంటే, వివాదాలకు తావుండదని ఏపీ ట్రాన్స్ కో అధికారులు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రోజుకు 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఇవ్వడం వల్ల... తాము బయట నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ కింద ఈపీడీసీఎల్ కు రావాల్సిన రూ. 1200 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటి వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ కు గాను ఏపీ ట్రాన్స్ కోకు రూ. 2,744 కోట్లకు గాను రూ. 504 కోట్లే చెల్లించారని ఆరోపించారు.