: తాత్కాలిక రాజధానికి వెళదామా?... ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ మంత్రి నారాయణ భేటీ!
ఆంధ్రప్రదేశ్ పాలనను గుంటూరు మిర్చి యార్డ్ లో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక రాజధానికి తరలించే విషయంపై చంద్రబాబు సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. వీలయినంత త్వరగా సొంత గడ్డపై నుంచే పాలనను సాగించాలన్న భావనతో గుంటూరు మిర్చి యార్డ్ లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని ఏపీ సర్కారు గతంలో తీర్మానించిన సంగతి తెలిసిందే.
అయితే తుళ్లూరులో నవ్యాంధ్ర రాజధాని కోసం భూ సమీకరణ పూర్తి కావడం, నిర్మాణానికి సంబంధించిన చర్యలు వేగం పుంజుకోవడంతో తాత్కాలిక రాజధాని పేరిట అనవసర ఖర్చెందుకన్న భావనతో ఇటీవల ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మరోవైపు తాత్కాలిక రాజధానిని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్యోగ సంఘాలతో నేడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీకి ఏపీఎన్జీవో, సచివాలయ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ అసోసియేషన్లు హాజరుకానున్నాయి.