: దండం పెట్టి అడిగినా కేంద్రం నిధులివ్వలేదు: ఆంధ్రా అసెంబ్లీలో గవర్నర్
తీవ్ర ఆర్థికలోటులో మునిగివున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని, లేకుంటే ఏ సంక్షేమ పథకానికీ నిధులు కేటాయించే పరిస్థితి ఉండదని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పక్క రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రం కల్పించుకోక తప్పదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 7 వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజ్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. గత 9 నెలల కాలంలో సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. నిధులివ్వాలని ముకుళిత హస్తాలతో కేంద్రాన్ని కోరినా, వారు స్పందించలేదని అన్నారు. రాజధాని నగర నిర్మాణం బృహత్తర బాధ్యతని, తన ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోరారు. అశాస్త్రీయంగా, హడావుడిగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఏంతో నష్టపోయామని తెలిపారు.