: పంట భూముల్లో రాజధాని నిర్మాణం బుద్ధి తక్కువ పని: చంద్రబాబుపై బీవీ రాఘవులు ఫైర్
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములపై నిన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు కొద్దిసేపటి క్రితం విరుచుకుపడ్డారు. వామపక్షాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన హెచ్చరించారు. రాజధాని కోసం వెయ్యెకరాలు చాలంటున్న వామపక్షాలు, తమ పార్టీ కార్యాలయాల కోసం పదెకరాల మేర భూములు అడుగుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన రాఘవులు, పంట భూముల్లో రాజధాని నిర్మాణం బుద్ధి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు. మంగళగిరి సమీపంలో భారీగా ప్రభుత్వ భూములున్నా, వాటిని వదిలేసిన చంద్రబాబు సర్కారు తుళ్లూరును రాజధానిగా ఎంచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు.