: పవన్ కల్యాణ్ తుళ్లూరు పర్యటన నేడే... ‘రాజధాని’ రైతులతో భేటీ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరులో నేడు పర్యటించనున్నారు. హైదరాబాదు నుంచి నేటి ఉదయం విమానంలో బయలుదేరే పవన్, ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ జనసేన ముఖ్యులతో కొద్దిసేపు భేటీ కానున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా నేరుగా తుళ్లూరు పరిధిలోని ఉండవల్లి, బేతపూడి గ్రామాలను చేరుకుంటారు. అక్కడి రైతులతో నేరుగా మాట్లాడనున్న పవన్ కల్యాణ్, వారికి జరిగిన నష్టమేంటన్న విషయంపై దృష్టి సారించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ బేతపూడి రైతులు జనసేన ప్లకార్డులు చేతబట్టి ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. రైతుల ధర్నా నేపథ్యంలో ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్, భూ సమీకరణపై చర్చించారు. ఆ తర్వాత వెనువెంటనే తుళ్లూరులో పర్యటించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఆయన తన పర్యటనను నేటికి వాయిదా వేసుకున్నారు. నేటి పర్యటనలో భాగంగా రైతులతో పాటు రైతు సంఘాలతోనూ పవన్ భేటీ కానున్నట్లు సమాచారం. తుళ్లూరులో పర్యటన అనంతరం నేటి రాత్రికి ఆయన తిరిగి హైదరాబాదు చేరుకుంటారు.