: లక్నో ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్నో విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. టీపీసీసీ చీఫ్ గా నిన్న పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. నేటి ఉదయం 10.20 గంటలకు ఆయన సోనియాతో భేటీ కావాల్సి ఉంది. ఈ మేరకు నేటి ఉదయం సతీసమేతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీలో కాకుండా లక్నో ఎయిర్ పోర్టులో ల్యాండైంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో విమానాన్ని పైలట్ లక్నో ఎయిర్ పోర్టులో దింపాడు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ దంపతులు లక్నో ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఢిల్లీ బయలుదేరేందుకు ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు.