: ఆడాళ్లకు అర్ధరాత్రి వరకు తిరుగుళ్లు ఏంటి?: నిర్భయ కేసు దోషి ఇంటర్వ్యూ
ఆడవాళ్లకు అర్ధరాత్రి వరకు ఏం పని ఉంటుందని నిర్భయ కేసు దోషి, ముఖేష్ సింగ్ ప్రశ్నించాడు. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో తాను చేసిన దుర్మార్గంపై పశ్చాత్తాపం లేకుండా మాట్లాడాడు. దాని వివరాలు... అత్యాచారాలకు మగాళ్లనే తప్పుపడుతుంటారు. ఆడవాళ్లకు కూడా అందులో భాగం ఉంటుందని సెలవిచ్చాడు. ఒక చేత్తో చప్పట్లు కొట్టలేమని సూత్రీకరించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు పబ్బులు, డిస్కోలకు తిరిగితే పర్లేదా? అని ప్రశ్నించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానమైనప్పుడు ఉరిశిక్ష ఎందుకని అడిగాడు. అలా ఉరిశిక్షలు విధిస్తే బాధిత మహిళలకు ప్రాణహాని ఉంటుందని అన్నాడు.
నిర్భయను బలాత్కరిస్తున్నప్పుడు ఆమె మౌనంగా ఉందని, ఎలాంటి ప్రతిఘటనా చేయలేదని అన్నాడు. ఆమెను తామేమీ అనలేదని, ఆమె స్నేహితుడ్ని మాత్రం చితకబాదామని చెప్పాడు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు తాను బస్సు నడుపుతున్నానని ముఖేష్ సింగ్ తెలిపాడు. ఆడవాళ్లు ఇళ్లలో ఉంటే అత్యాచారం చేయాలనే ఆలోచన ఎలా వస్తుందని ఎదురు ప్రశ్నించాడు. కాగా, 2012 డిసెంబర్ 16న రాత్రి 9 గంటలకు బాధితురాలు సినిమా చూసి స్నేహితునితో ఇంటికి బయల్దేరింది. గమ్యం చేరుస్తామని బస్సు ఎక్కించుకున్న ఆరుగురు కామాంధులు ఆమె శరీరంతో ఆడుకుని రోడ్డుపై విసిరేశారు. జరిగిన ఘోరాన్ని తట్టుకోలేకపోయిన ఆమె సింగపూర్ లోని ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.