: కేంద్ర బడ్జెట్ పూర్తి వివరాలు - పార్ట్ 1
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లోని ప్రధానాంశాలు.
* భారత్ అభివృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది.
* ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకం.
* మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 340 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
* దేశాభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం గత 9 నెలలుగా ఎంతో శ్రమించింది.
* దేశ ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా ఉంది.
* పెట్టుబడులకు మన దేశం చాలా అనువైనది.
* ద్రవ్యోల్బణం 5.1 శాతానికి దిగి వచ్చింది.
* వృద్ధి రేటును పెంచేందుకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం.
* గతంలో లేని విధంగా రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇస్తున్నాం.
* ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నాం.
* అవినీతి అంతం కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు.
* స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది.
* పేదరిక నిర్మూలన, నిరుద్యోగాన్ని పారద్రోలటమే లక్ష్యం.
* మాది నిరంతరం పనిచేసే ప్రభుత్వం.
* జన ధన పథకం విజయవంతం అయింది.
* 50 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది.
* 2015-16లో వృద్ధిరేటు 8 నుంచి 8.5 శాతానికి మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నాం.
* త్వరలోనే రెండంకెల వృద్ధిరేటును సాధిస్తాం.
* 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామాల్లో 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం.
* 2020 నాటికి సంపూర్ణ విద్యుదీకరణను పూర్తి చేస్తాం.
* విద్యుత్ గ్రిడ్ తో సంబంధం లేని సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం.
* ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఉద్యోగం కలిగి ఉండేలా చూస్తాం.