: ప్రేమిస్తున్నానన్నాడు... ఫోటోలు, వీడియో తీసి స్నేహితులకు పంచాడు!
ప్రేమ పేరిట సమాజంలో జరుగుతున్న ఘోరాలకు అంతులేకుండా పోతోంది. యువతరం సినిమాల ప్రభావంతో చేస్తున్న తప్పులకు జీవితాలు బలైపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రేమ పేరిట జరిగిన వంచన కలకలం రేపింది. కొత్తగూడెం ఫార్మసీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని హుస్సేన్ అలీ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, ఆమెను లోబరుచుకున్నాడు. ఆమెతో కలిసి ఉన్న సమయంలో ఫోటోలు తీసి, వీడియో చిత్రీకరించాడు. వీటిని తన స్నేహితులు సునీల్, రెహ్మాన్, మనోజ్ లకు షేర్ చేశాడు. దీంతో వారు ముగ్గురూ కూడా ఆమెను వేధించడం ప్రారంభించారు.
ఇలా ఆమె నుంచి లక్షలాది రూపాయల డబ్బులు గుంజుకున్నారు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో, హుస్సేన్, సునీల్, రెహ్మాన్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మనోజ్ కోసం గాలిస్తున్నారు. వీరిపై 376, 384 సెక్షన్లతో పాటు, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వారి నుంచి యువతికి చెందిన 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు.