: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'జనసేన' తొలి ధర్నా
ఏపీ కొత్త రాజధాని భూసేకరణ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చాలామంది రైతులు ఇప్పటికే తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేయగా... మరికొంత మంది రైతులు మాత్రం భూములిచ్చేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు రైతులు ఏకంగా ధర్నాకు దిగారు. బేతపూడి గ్రామంలో జనసేన పార్టీకి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. ల్యాండ్ పూలింగ్ ను తాము వ్యతిరేకిస్తున్నామని, బలవంతంగా తమ నుంచి భూములు లాక్కుంటే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ నేత పవన్ కల్యాణ్ చెబితేనే టీడీపీకి ఓటు వేశామని... కాబట్టి, ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణను పవన్ కల్యాణ్ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, వీరంతా జనసేన జెండాలను చేతబట్టి ధర్నాకు దిగారు. జనసేన స్థాపించిన తర్వాత ఆ పార్టీ జెండాలను చేతబట్టి ఇంత వరకు ఏ కార్యక్రమం కూడా జరగలేదు. పార్టీ పేరుతో జరుగుతున్న మొట్టమొదటి నిరసన కార్యక్రమంగా ఈ ధర్నా వార్తల్లోకెక్కింది.
ధర్నాలో పవన్ ఫొటోతో ఉన్న బ్యానర్లను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ బ్యానర్లపై, "ఏ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానన్న పవన్, తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ పరిస్థితుల్లో పవనే మాకు దిక్కు" అంటూ రాశారు. తమకు పవన్ కల్యాణే దేవుడని, ఆయన తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని జనసేన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి దీనిపై జనసేన అధినేత ఏ విధంగా స్పందిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.