: వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు గేల్ దే... అయినా వన్డేల్లో మనోళ్ల ముందు దిగదుడుపే!
వరల్డ్ కప్ టోర్నీలో పరుగుల వరద పారించిన క్రిస్ గేల్, వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్ గా అవతరించాడు. జింబాబ్వేతో మ్యాచ్ లో 147 బంతుల్లో 215 (16 సిక్స్ లు, 10 ఫోర్లు) పరుగులు సాధించిన క్రిస్ గేల్, అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అంతేకాక వరల్డ్ కప్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన అతడు, వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ ను కూడా తన పేరిట లిఖించుకున్నాడు.
అయినా భారత క్రికెటర్ల ముందు గేల్ విధ్వంసం దిగదుడుపే. నేటి గేల్ డబుల్ సెంచరీతో కలుపుకుని వన్డేల్లో మొత్తం ఐదు డబుల్ సెంచరీలు నమోదు కాగా, వాటిలో గేల్ ది మినహా మిగిలిన నాలుగు భారత క్రికెటర్లు సాధించినవే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (200) ఒకటి, వీరేంద్ర సెహ్వాగ్ (219) ఒక డబుల్ సెంచరీ సాధించగా, టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (209, 264) ఏకంగా రెండు డబుల్ సెంచరీలను సాధించాడు. ఒకవేళ డబుల్ సెంచరీల్లోనూ అత్యధిక పరుగులను పరిగణనలోకి తీసుకుంటే, రోహిత్, సెహ్వాగ్ ల తర్వాతి స్థానమే గేల్ కు దక్కుతుంది. అంటే, మనోళ్ల రికార్డుల ముందు గేల్ విధ్వంసం దిగదుడుపేనన్నమాట.