: ట్రాఫిక్ పోలీసులకు డబ్బులివ్వొద్దు...సిస్టమ్ మారింది: హైదరాబాదు ట్రాఫిక్ కమిషనర్
వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు నేరుగా డబ్బులు చెల్లించొద్దని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని నగరంలో క్యాష్ లెస్ విధానం అమలవుతోందని అన్నారు. చలాన్లను ఈ-సేవ లేదా ఆన్ లైన్లో చెల్లింపులు జరపాలని ఆయన సూచించారు. వాహనాలు తనిఖీ చేసే అధికారం కానిస్టేబుళ్లకు లేదని, ఎస్సై, ఆపై స్థాయి అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. వాహనదారులు విధిగా ఒరిజినల్ పత్రాలు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జిరాక్స్ పత్రాలను తాము అనుమతించేది లేదని ఆయన తెలిపారు. అవినీతి, అక్రమాలను అదుపు చేయడంలో భాగంగా పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.