: రాష్ట్రపతి వద్దకు బీహార్ ముఖ్యమంత్రి పంచాయతీ
బీహార్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. గవర్నర్ వద్దకెళ్లిన ముఖ్యమంత్రి పంచాయతి రాష్ట్రపతి వద్దకు చేరనుంది. బీహార్ లో అధికారపక్షం జేడీ(యూ) శాసనసభ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. దీంతో పాలన పగ్గాలు అప్పగించాలని నితీష్ కుమార్ ముఖ్యమంత్రి జితన్ కుమార్ మాంఝీకి అల్టిమేటం జారీ చేశారు. దీనికి ఆయన తిరస్కరించడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మాంఝీ నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి శాసనసభలో బలపరీక్షకు మద్దతివ్వాలని కోరారు.
అనంతరం ఆయన అనుగ్రహం లభించిందని, తాను రాజీనామా చేసేది లేదని చెబుతూ, మంత్రి వర్గ విస్తరణకు అనుమతినివ్వాలని గవర్నర్ ను కోరారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేటి సాయంత్రం తన మద్దతు దారులైన 130 మంది ఎమ్మెల్యేలతో హస్తిన చేరుకోనున్నారు. అనంతరం ఆయన వారితో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.