: దమ్ముంటే... నాపై పోటికి దిగండి: చంద్రబాబుకు తలసాని సవాల్!
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. గతంలో పార్టీ అధినేత హోదాలో చంద్రబాబును కీర్తించిన తలసాని, పార్టీ మారగానే బద్ధ విరోధిలా మారిపోయారు. దమ్ముంటే, తనపై పోటీ చేయాలని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు. నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా తలసాని, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
‘‘చంద్రబాబు షో పుటప్ చేస్తున్నడు. నేను టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సర్కారును ఇరుకున పెట్టేలా మాట్లాడాలని చెప్పాడు. దీనిని మూడు సార్లు తిరస్కరించాను’’ అని తలసాని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. మరి తలసాని సవాల్ పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.