: 15 రోజుల కాంట్రాక్టు పెళ్లి కోసం యువతి ఖరీదు రూ.80 వేలు... పాతబస్తీలో దారుణానికి పోలీసుల చెక్
హైదరాబాదులోని పాతబస్తీలో పేదరికాన్ని ఆసరా చేసుకుని కొందరు వ్యక్తులు దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు యత్నించిన దుర్మార్గులను పోలీసులు అడ్డుకున్నారు. పెళ్లి చేసుకుని కేవలం 15 రోజుల పాటు కాపురం చేస్తే, రూ.80 వేలు వస్తాయంటూ ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతిని మభ్యపెట్టారు. అయితే ఓ ముస్లిం మత పెద్ద పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు యువతి ఆ నరక కూపం నుంచి బయటపడింది.
వివరాల్లోకెళితే... పాతబస్తీకి చెందిన ఓ యువతితో 15 రోజుల పాటు కాపురం చేసేందుకు సోమాలియాకు చెందిన సయ్యద్ ఇబ్రహీం రూ.80 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మధ్యవర్తుల సహాయంతో సదరు యువతిని పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న అతడు ఆ తర్వాత యువతికి ఇవ్వాల్సిన తలాక్ (విడాకులు) పత్రాలనూ రెడీ చేసుకున్నాడు. మరికొద్ది క్షణాల్లో ఆ యువతి, ఇబ్రహీం సొంతమయ్యేదే.
అయితే ఓ ముస్లిం మత పెద్ద ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఫలక్ నూమా పోలీసులు పెళ్లిని నిలిపివేశారు. యువతిని మోసగించేందుకు యత్నించిన ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంతో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్టైన మధ్యవర్తుల్లో ఇద్దరు మహిళలుండటం గమనార్హం.