: జీహెచ్ఎంసీ పీఠం కోసమే ఫ్లై ఓవర్లు, స్కై వాకర్లంటూ ప్రచారం: టీఆర్ఎస్ పై కోమటిరెడ్డి ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ కుయుక్తులు పన్నుతోందని ఆయన ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ది కోసమే ఫ్లై ఓవర్లు, స్కై వాకర్లంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఊదరగొడుతోందని ఆయన విమర్శించారు. నిధుల మంజూరులో పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారు, విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపుతోందన్నారు. కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలు సర్కారుపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు.