: చంద్రబాబుపై కేసు నమోదు చేయండి... సైఫాబాద్ పీఎస్ లో టీ న్యాయవాది కంప్లైంట్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేయాలంటూ తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ, ఏపీల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్ రెడ్డి నిన్న సైఫాబాదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు... హైదరాబాద్ నగరంలో ఉండి ఆంధ్రాను పరిపాలించడం విదేశాల్లో ఉండి పాలించినట్టుగా ఉందని వాఖ్యానించారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. తెలంగాణను అవమానించే రీతిలో విదేశంతో పోల్చడం రాజద్రోహం అవుతుందని చెబుతూ ఆయన పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు వస్తాయని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు. రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు.

More Telugu News