: కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిపై కేంద్రం వేటు వేసింది. పదవికి అనిల్ గోస్వామి కళంకం తీసుకొచ్చారని పేర్కంటూ కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హ్ అరెస్టును ఆపాలని ఆయన సీబీఐపై ఒత్తిడి తీసుకువచ్చారని సీబీఐ పీఎంవోకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన కేంద్రం ఆరోపణలు నిజమని తేలడంతో, అనిల్ గో స్వామిని ఈ ఉదయం పిలిచి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ అడిగారు. అరగంటసేపు సమావేశమైన సందర్భంగా, రాజ్ నాథ్ సింగ్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.
కాగా, పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలకు దీటుగా బీజేపీ ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగారంలాంటి అవకాశాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గో స్వామి నాశనం చేశారని బీజేపీ భావిస్తోంది. ఇదే క్రమంలో అతనిపై చర్యలు తీసుకుంటే, అవినీతి, సిఫారసులను తాము సహించమనే సందేశం ఇచ్చినట్టవుతుందని, ఆయనను తొలగించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.