: ఎంసెట్ నిర్వహణపై నేడైనా నిర్ణయం వచ్చేనా?... నేటి ఏపీ కేబినెట్ భేటీపై సర్వత్ర ఆసక్తి
తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ తన వైఖరి స్పష్టం చేయగా, ఏపీ సర్కారు ఇంకా తర్జనభర్జన పడుతోంది. ఎంసెట్ ను తామే నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, అందుకనుగుణంగా చర్యలనూ ప్రారంభించింది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కారు తదనంతర చర్యలు తీసుకోవడంలో మాత్రం తీవ్ర ప్రతిష్టంభన ఎదుర్కొంటోంది. పలుమార్లు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసినా ప్రయోజనం లేకపోయింది.
పరీక్ష నిర్వహణపై తెలంగాణ సర్కారు స్పష్టమైన ప్రకటన నేపథ్యంలో, ఏపీ సర్కారు కూడా దీనిపై నెలకొన్న సస్పెన్స్ కు తెరదించాలని నిర్ణయించింది. నేడు సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో ఎంసెట్ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. భేటీలో ఉద్యోగులకు పీఆర్సీ, రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు తదితర కీలకాంశాలపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.