: దమ్ముంటే జీవో ఇవ్వు...రాష్ట్రపతివా? రాజ్యాంగేతర శక్తివా?: తమ్మినేని సీతారాం
సీఆర్డీఏ కమీషనర్ శ్రీకాంత్ పై వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మించనున్న ప్రాంతంలో రెండో పంట వేయొద్దని చెప్పడానికి శ్రీకాంత్ ఎవరని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రాష్ట్రపతా? లేక రాజ్యాంగేతర శక్తా? అని ఆయన నిలదీశారు. శ్రీకాంత్ కు చేతనైతే రెండో పంట వేయవద్దని జీవో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోంపేట, కాకరాపల్లిలో అణువిద్యుత్ కేంద్రానికి అనుమతులు వచ్చేలా చేసి, నరమేధం సృష్టించినది నీవు కాదా? అని ఆయన ప్రశ్నించారు.
నరహంతకుడికి చంద్రబాబు సీఆర్డీఏ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఆయన నిలదీశారు. "చంద్రబాబూ, నీ హెరిటేజ్ సంస్థను మూసేస్తే ఊరుకుంటావా?" అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ప్రభుత్వమా? రాక్షస పాలనా? అని ఆయన మండిపడ్డారు. జగన్ తణుకు దీక్ష అంటే ప్రభుత్వం వణుకుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.