: వరకట్న వేధింపుల కేసు పెట్టిందని... కాల్ గర్ల్స్ వెబ్ సైట్లో భార్య ఫొటో పెట్టిన భర్త

అదనపు కట్నం తెమ్మంటే, కేసు పెట్టిందన్న కసితో ఓ కీచక భర్త, తన భార్యపై వ్యభిచారి అనే ముద్ర వేసేందుకు యత్నించాడు. ఇందులో భాగంగా కాల్ గర్ల్స్ కు చెందిన ఓ వైబ్ సైట్ లో భార్య ఫొటోను అప్ లోడ్ చేయడంతో పాటు ఆమె ఫోన్ నెంబరు కూడా అందులో చేర్చాడు. విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయిన బాధిత మహిళ మరోమారు పోలీస్ స్టేషన్ గడప తొక్కక తప్పలేదు. వివరాల్లోకెళితే... హైదరాబాదులోని సైదాబాదుకు చెందిన మురళికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మురళి దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అదనపు కట్నం తేవాలని భార్యను వేధించడం మొదలుపెట్టిన మురళి ఇటీవల చిత్ర హింసలకూ తెరతీశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, అతడిపై వరకట్నం వేధింపుల కేసు పెట్టి పుట్టిల్లు చేరింది. తనపైనే కేసు పెడుతుందా అని భావించిన మురళి, తనలోని పైశాచికత్వాన్ని మేల్కొలిపాడు. భార్యపై వ్యభిచారి అనే ముద్ర వేయాలని నిర్ణయించుకుని, ఆమె ఫొటోతో పాటు మొబైల్ నెంబరును కూడా ఓ కాల్ గర్ల్స్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News