: రాజయ్య మీద ఆరోపణలపై విచారణ కమిటీ... సన్నాహాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అవినీతికి పాల్పడ్డాడంటూ, అతనిపై విచారణ కమిటీని నియమించేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రత్యేక రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టిన కొత్త ప్రభుత్వంలో ఏడు నెలలు తిరగకముందే కీలక మంత్రిని బర్తరఫ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శల జడివాన నుంచి ఉపశమనం పొందేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
వైద్య, ఆరోగ్య శాఖలో రాజయ్య అవినీతికి పాల్పడ్డాడని, ఆయన అక్రమాలను వెలికితీసేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, సదరు కమిటీ ద్వారా రాజయ్య బర్తరఫ్ పై తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేటతెల్లం చేసేందుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపించాలని రాజయ్య కూడా నిన్న కోరిన సంగతి తెలిసిందే. విచారణలో తాను కడిగిన ముత్యంలా బయపడతానని ఆయన వాదిస్తున్నారు.