: 'స్వచ్ఛ భారత్'లో నిమగ్నమైన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. తాజాగా 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు తనవంతు కంటే ఎక్కువగా చేయాలని సంకల్పించాడు. తొలిసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వారా ఈ కార్యక్రమానికి సల్మాన్ నామినేట్ అయ్యాడు. ఇప్పుడు తన ద్వారా పలువురిని నామినేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అదేదో ఒకరినో, ఇద్దరినో కాదు... ఏకంగా వందమందిని! "గౌరవ ప్రధానమంత్రి ద్వారా నేను స్వచ్ఛ భారత్ కు నామినేట్ అయ్యాను. ఈ క్రమంలో మహారాష్ట్రకు దగ్గరలోని మూడు గ్రామాల్లో కొన్ని ఇళ్ల వద్ద శుభ్రం చేసి, అక్కడి ఇళ్లకు రంగులు వేశాను. ఈ ప్రయత్నాన్ని నేను కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నా. స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఒక్కరే చేయగలిగేది కాదు. ప్రతి ఒక్కరూ ఏం చేయగలుగుతారనేది ఇక్కడ ప్రధానం. అందుకే గణతంత్ర దినోత్సవం రోజున ఈ సామాజిక ప్రచారం గురించి మాట్లాడాలనుకుంటున్నా. స్వచ్ఛ భారత్ కు ప్రతి నెల నేను 100 మందిని నామినేట్ చేస్తా. దయచేసి మీ ఇళ్ళ వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లోను సరైన విధంగా స్వచ్ఛ భారత్ ను ప్రారంభించండి. కార్యక్రమానికి ముందు, ఆ తరువాత తీసిన ఫోటోలను, వీడియోలను అప్ లోడ్ చేయండి. వీటి నుంచి ఉత్తమంగా చేసిన ఐదుగురిని ఎంపికచేసి, నా ఎఫ్ బీ పేజ్ లో వారి గురించి ప్రత్యేకంగా పేర్కొంటాం. బహుమతి కూడా అందజేస్తాం. తొలి జాబితా రేపు అప్ లోడ్ చేస్తా" అంటూ సల్మాన్ తన ఎఫ్ బీలో పోస్టు చేశాడు.