: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం
భారత్ టూర్ ను అర్థాంతరంగా ముగించుకున్న వెస్టిండిస్ క్రికెట్ బోర్డు, బీసీసీఐల మధ్య ఇప్పట్లో సఖ్యత కుదిరేలా లేదు. గతేడాది టీమిండియాతో టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు వచ్చిన కరీబియన్ టీమ్ మధ్యలోనే వెళ్లిపోయింది. దాంతో, ఆగ్రహించిన బీసీసీఐ, వెస్టిండిస్ జట్టుకు అల్టిమేటం జారీ చేసింది. సిరీస్ అర్థాంతరంగా రద్దయిన నేపథ్యంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్న బీసీసీఐ, నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది.
తాజాగా మరోమారు ఈ విషయంపై వెస్టిండిస్ బోర్డుకు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ, తనకు జరిగిన నష్టానికి గాను 41.97 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు వెస్టిండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్, ఇంటర్-గవర్నమెంటల్ కరీబియన్ కమ్యూనిటీ సెక్రటరీ జనరల్ ఇర్విన్ లారాక్వుకు ఓ లేఖ రాసింది. ‘‘గతేడాది అక్టోబర్ లో వెస్టిండిస్ జట్టు అకస్మాత్తుగా, ఏకపక్షంగా భారత్ పర్యటనను ఉపసంహరించుకుంది. అందుకుగానూ నష్టపరిహారం చెల్లించండి’’ అంటూ ఆ లేఖలో కోరింది.