: ధర్మవరంలో యువతి అపహరణకు విఫల యత్నం... ఏఎస్పీ కార్యాలయం వద్ద ఘటన
అనంతపురం జిల్లా ధర్మవరంలో యువతిని అపహరించేందుకు ఓ ముఠా విఫలయత్నం చేసింది. కిడ్నాపర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న యువతి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన పట్టణంలోని అదనపు ఎస్పీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకోవడం గమనార్హం. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న స్రవంతిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో తనపై దాడికి దిగిన కిడ్నాపర్ల నుంచి స్రవంతి తప్పించుకోగలిగింది. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఏఎస్పీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం పట్టణాన్ని జల్లెడ పడుతున్నారు.