: ఈయన ట్రాఫిక్ కానిస్టేబులా?... బ్రేక్ డ్యాన్సరా?
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి వెళితే, అక్కడి ఓ కూడలిలో కనిపించే ట్రాఫిక్ కానిస్టేబుల్ ను చూసి మీరు తప్పక ఆశ్చర్యపోతారు. అతని విధి నిర్వహణ తీరు విలక్షణం! అందరిలా సాధారణంగా చేతులు ఊపుతూ ట్రాఫిక్ సంజ్ఞలు చేయడు. ప్రతి సంజ్ఞకు కాస్తంత కళాత్మకత అద్దుతాడు. విశ్వవిఖ్యాత డ్యాన్సర్, సింగర్ మైకేల్ జాక్సన్ కు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన స్టెప్పు 'మూన్ వాక్'. ఆ స్టెప్పును మనవాడు అలవోకగా ప్రదర్శిస్తాడు. ఆ స్టెప్పు కూడా అతని విధుల్లో అందంగా కలిసిపోతుంది. ఇంకా ఎన్నో స్టెప్పులను ట్రాఫిక్ సంజ్ఞలతో మేళవించి చూపరులను అలరిస్తాడీ మూన్ వాకర్. అతని పేరు రంజిత్ సింగ్. సన్ గ్లాసెస్, రెగే స్టయిల్ మీసాలు, చేతికి రిస్ట్ బ్యాండ్ తో అప్ టు డేట్ ఫ్యాషన్ ఫాలోవర్ లా కనిపిస్తాడు. విధి నిర్వహణలో ఎందుకిలా డ్యాన్సులు చేయడం అని అడిగితే... ఈ విలక్షణత ద్వారా ప్రజలు తనను అభిమానిస్తున్నారని, తద్వారా ట్రాఫిక్ రూల్సును పాటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. రంజిత్ చేసే మూన్ వాక్ ను ఎందరో తమ సెల్ ఫోన్లతో చిత్రీకరించి భద్రపరుచుకుంటున్నారు. ఇప్పుడు అతగాడి వీడియో ఒకటి యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.