: నకిలీ గుర్తింపు నంబర్ మొబైళ్లపై నిషేధం... తక్షణం అమల్లోకి!

తప్పుడు యూనిక్ ఐడెంటిటీ నంబర్ల ద్వారా దేశీయ మార్కెట్లోకి దిగుమతవుతున్న సెల్ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. నకిలీ ఐఎంఈఐలతో వస్తున్న జీఎస్ఎం మొబైళ్లతో పాటు డూప్లికేట్ ఈఎస్‌ఎన్ (ఎలక్ట్రానిక్ సీరియల్ నంబర్), ఎంఐఐడీతో (మొబైల్ ఎక్విప్‌ మెంట్ ఐడెంటిఫైయర్) దిగుమతి అవుతున్న సీడీఎంఏ ఫోన్లపై నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రతి మొబైల్‌కు 15 నుంచి 17 అంకెలు కలిగిన ఐఎంఈఐ నంబర్ ద్వారా సెల్‌ఫోన్ వాడుతున్న వ్యక్తి ఏ నెట్‌ వర్క్ వాడుతున్నా అతనున్న బేస్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్‌ను ట్రాక్ చేసేందుకు ఈ యూనిక్ నంబరే కీలకం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ తెలిపింది.

More Telugu News