: అత్యంత ఘనంగా ఐటీ వరల్డ్ కాంగ్రెస్ నిర్వహణ: కేటీఆర్
2018లో హైదరాబాదులో జరిగే ఐటీ వరల్డ్ కాంగ్రెస్ సదస్సును అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఐటీ వరల్డ్ కాంగ్రెస్ సదస్సును హైదరాబాదులో నిర్వహించేందుకు అంగీకరించిన నాస్కామ్ కు ఆయన నేడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచ ఐటీ దిగ్గజాలను ఆహ్వానిస్తామని వివరించారు. భారత, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈవెంట్ ను నిర్వహిస్తామని తెలిపారు. అంతకన్నాముందు 2016లో బ్రెజిల్ లో జరిగే సదస్సుకు రాష్ట్ర బృందం వెళుతుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవిష్యత్ కోసం అమెరికాతో పాటు పలు దేశాల్లో కేసీఆర్ పర్యటించనున్నారని తెలిపారు. సీఎం పర్యటన వివరాలు ఖరారు కావలసి వుందని పేర్కొన్నారు. తదుపరి కేబినెట్ సమావేశం ముందుకు ఐటీ పాలసీని తీసుకువస్తామని చెప్పారు.