: భార్య చీర కట్టుకోలేదని... ఎవరెస్ట్ అధిరోహకుడిని వెలివేసిన గ్రామం
అతని పేరు రాహుల్ ఎలాంగే... మే 2012లో ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ ను అధిరోహించి, రాయ్ ఘడ్ జిల్లా బుద్రుక్ గ్రామానికి ఎంతో పేరు తెచ్చి పెట్టాడు. అయితేనేం, ఇప్పుడా గ్రామంలో నిషేధాన్ని ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే... కొండలు ఎక్కాలన్న ఉత్సాహం ఉన్నవారికి శిక్షణ ఇస్తూ, పాల వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో మే 2014లో స్వగ్రామం బుద్రుక్ కు తన భార్య పూర్ణిమతో కలసి రాహుల్ వచ్చాడు. తొలుత తన భార్య చీర కట్టుకోలేదని, బొట్టు పెట్టుకోదని, జీన్స్ ధరిస్తుందని విమర్శించిన ప్రజలు... చివరకు సాంఘిక బహిష్కరణ శిక్ష విధించారని రాహుల్ వాపోయాడు. కనీసం గుడికి పోనివ్వరని, తన పశువులకు నీరు ఇవ్వడం లేదని వివరించాడు. నీటి కోసం 20 నిమిషాలు నడిచి దగ్గరలోని చెరువుకు వెళుతున్నట్టు పేర్కొన్నాడు. తన పశువుల పాకను తగలబెట్టాలని కుట్ర చేస్తున్నట్టు రాహుల్ పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో బహిష్కరణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. "రాహుల్ పశువుల పాక తగలబడితే మాకు సంబంధం లేదని 38 కుటుంబాలు గ్రామ పంచాయతీకి లేఖలు రాశాయి" అని తన ఫిర్యాదులో రాహుల్ పేర్కొన్నాడు.